పద్మవ్యూహం

తేది: 2016-09-23 సమయం – రాత్రి 10 గంటలు:

“అమెరికాకి వెళ్ళినా నీ అనకాపల్లి బుద్ది మాత్రం మానలేదు కదా! మళ్ళీ ఇక్కడికొచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా లేక అక్కడే పిల్లా, జల్లా వెతుక్కొని జాలీగా గడిపేస్తావా?”

అంటూ అలసిపోయిన మొహంతో, పునర్జించిన స్వరంతో, పరుగులు తీస్తున్న సాంకేతికతని వాడుకుంటూ skype లో కలిసాడు కుమార్. ఒక గంట సేపు బఠాణీలు తింటూ బాతాకానీ కానిచ్చారిద్దరు.  ఉద్యోగం అనే ఊబిలో నుండి బయటపడి ప్రకృతి ఇచ్చే ప్రశాంతత కోసం వెతుకుతూ బాట మొదలుపెట్టాడు ప్రభ.

తేది: 2016-09-23 సమయం 12 గంటలు:

కారు చీకట్లో నడుస్తున్న ప్రభకి హఠాత్తుగా వెలిగిన కారు లైట్లు భయపెట్టాయి. తర్వాత మెల్లగా కారు డోర్ తెరుచుకుంది. ఎవరైతే తనకెందుకని పట్టించుకోకుండా తన దారిలో తను నడుచుకుంటూ కారుని దాటి వెళిపోతున్నాడు ప్రభ.  కాని ఎవరూ దిగుతున్నట్టు కనిపించక ఆత్రుతతో కారు లోపల చూశాడు. లోపల ఎవరూ లేరు. దగ్గర్లో ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాడు, కాని ఎవరూ కనపడట్లేదు.   దూరం నుండి వస్తున్నట్టు నక్క అరుపులు వినిపించాయి. అది నక్క అరుపో లేక కుక్క మూలుగో అర్ధం కాలేదు కాని ఇప్పుడు అంత అవసరమైన విషయం కాదని వదిలేసాడు. కారు లోపల మొత్తం చూశాడు. ఎవరూ లేరు. కారు డోర్ వేసి మళ్ళీ తన నడక మొదలుపెట్టాడు. మళ్ళీ కారు లైట్లు వెలిగాయి, ప్రభ సంధిగ్ధంలో నడక వేగాన్ని పెంచాడు. కారు ఇంజన్ స్టార్ట్ అయిన శబ్దం వినబడింది. కారు తన వైపే వస్తోంది. ప్రభ పరుగులు తీయటం మొదలుపెట్టాడు. కాని దూసుకొస్తున్న కారు వేగ్గాన్ని ప్రభ కాళ్ళు దాటలేక పోయాయి. కారు వేగానికి తన వేగం తోడై రెట్టింపు దూరంలో ఎగిరి పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న గుండె, ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న మెదడుకి అవకాశం వదలకుండా కారు ప్రభ తల మీద నుండి వెళ్ళిపోయింది. కారు మళ్ళీ అది ముందున్న స్థలంకి చేరుకుంది. జోరున వర్షం మొదలైంది. ప్రభ దేహం నుండి వస్తున్న రక్తంతో పాటు కారుకి అంటుకున్న రక్తాన్ని కూడ తుడిచిపెట్టడానికే వచ్చినట్టుగా, ఈ ఆటలో తనదే అంతిమ విజయం అని ఆనందంతో చిందులేస్తున్న ధగ ధగ మెరుపులు, ఆ మెరుపుల గర్జనలకి ఉలిక్కిపడి ఏడుస్తున్న పసి పిల్లలు, వాళ్ళ రాగంతో నిద్ర వీడిన తల్లిదండ్రులతో లోకం మాత్రం సజావుగా సాగిపోతోంది.

********************************************************

తేది: 2016-09-23 సమయం – రాత్రి 10 గంటలు:

“అమెరికాకి వెళ్ళినా నీ అనకాపల్లి బుద్ది మాత్రం మానలేదు కదా! మళ్ళీ ఇక్కడికొచ్చే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా లేక అక్కడే పిల్లా, జల్లా వెతుక్కొని జాలీగా గడిపేస్తావా?”….

తేది: 2016-09-23 సమయం – రాత్రి 11 గంటలు:

కుమార్ తో మాటలు కట్టిపెట్టి అన్నం తిని బయటకి వెళ్దామని చేతులు కడుక్కుని భోజనం చేద్దామని కూర్చున్నాడు. తింటుండగా దఢ్ దఢ్ అంటున్న తలుపు శబ్దాన్ని విని బాత్ రూం లోపల చూశాడు. ఎవరూ కనబడలేదు. లైట్లు తీసేసి తలుపుని లాక్ చేసి మళ్ళీ తినటం మొదలు పెట్టాడు. ఇంతలో మళ్ళీ అదే తలుపు నుండి దఢ్ దఢ్ మని శబ్దం. తలుపు దగ్గరకి వెళ్ళే సరికి తలుపు కొట్టుకోవటం ఆగిపోయింది. కాని బాత్ రూంలో లైట్ వెలుగి ఉంది. మళ్ళీ ఎవరన్నా ఉన్నారేమో అని చూశాడు. ఎవరూ లేరు. ప్రభ కి ఎందుకో తెలియని భయం పుట్టింది. తినటం ఆపేసి బయటకి వెళ్దామని చెప్పులు వేసుకుంటుండగా దఢేల్ అని ఇంటి తలుపు మూసుకుంది. తలుపు తెరవ టానికి చాలా ప్రయత్నించాడు కానీ తలుపు తెరుచుకోవట్లేదు. ప్రభ ఎప్పుడు దెయ్యాలని నమ్మేవాడు కాదు. ఏ దెయ్యమో తనేంటో చూపించాలని ఇదంతా చేస్తోందా అని గుండె నిండా భయంతో, చతికిలి పడిపోయిన ధైర్యంతో తన ఫ్రెండ్ రాజాకి ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరకి వెళ్ళాడు. ఫోన్ దానంతట అదే ఎగిరి గోడకి గుద్దుకుని బద్దలైపోయింది. ప్రభకి భయం ఇంకా పెరిగింది. బయటకి దారున్న ఇంకో తలుపు దగ్గరకి పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు, ఇంకో తలుపు, ఇంకో తలుపు.  అన్ని తలుపుల దగ్గరా ఒకటే వైనం, మూసుకుపోవటం. ఇంతలో హాలులో గోడకి బిగించిన టి.వి. దానంతట అదే గాలిలో ఎగురుకుంటు తన వైపే వస్తోంది. ఏమి చేయలేనని నిస్సహాయంతో ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని కళ్ళు మూసుకుని చావటానికి సిద్దపడిపోయాడు. ఇంతలో టి.వి. పగిలిన శబ్దం వినబడింది కాని తన ఒంటికి ఏమి తగలలేదని కళ్ళు తెరిచి చూసాడు. ఎలా వచ్చిందో తెలీదు కాని డిన్నర్ టేబుల్ దగ్గర ఉండాల్సిన కుర్చీ తన ముందు ముక్కలు ముక్కలుగా పడి ఉంది టి.వి. తో పాటుగ. ప్రభకి అర్దం కాలేదు. ఈ దెయ్యం నన్ను చంపాలనుకుంటే ఆ టి.వి. తో నన్ను చంపేయచ్చు కదా లేక భయపెట్టాలనుకుంటే ఆ టి.వి ని అలాగే వెనక్కి తీసుకుపోవచ్చు, కాని ఇలా కుర్చీ టి.వి. కొట్టుకోవటం ఏంటి అని అంత భయంలో కూడ ఆలోచించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారిగా ఇంట్లోని సగం వస్తువులు తన వైపే దూసుకొస్తున్నాయి, ఇంకో సగం తనని కాపాడటం కోసమే అన్నట్టు వాటికి అడ్డంగా వెళ్తున్నాయి. ఇల్లంతా గందరగోలంగా మారింది. ఎగురుతున్న సామాన్లు, పగులుతున్న సామాన్లు, భరించలేని శబ్దాల మధ్య తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు ప్రభ.

తేది: 2016-09-24 సమయం – ఉదయం 6 గంటలు:

ప్రభకి మెలుకువ వచ్చి లేచి చూశాడు. తన హాల్లో ఒక మూలకి పడిపోయి ఉన్నాడు. ఇల్లు చూస్తే మొత్తం చిందర వందరగా ఉంది. రాత్రి జరిగింది కొంచెం కొంచెం గుర్తుకు వస్తోంది కాని ఎంత వరకు జరిగింది, ఎలా ఆగిపోయింది అనేదేమి అర్దం కావట్లేదు. ఇప్పటిరోజుల్లో ఇలాంటి విషయం ఒకటి జరిగిందని చెప్తే ఎవరైనా నమ్ముతారా లేక చులకనగా చూస్తారా  లేక ఇదంతా తనే చేసాడని  పిచ్చోడిలా జమకడతారా  అని ఆలోచించి జరిగిన విషయం ఎవరికి చెప్పకూడదని నిశ్చయించుకుని వేరే రూం కి మారిపోయాడు.

********************************************************

తేది: 2016-09-22 సమయం – రాత్రి 11 గంటల 45 నిమిషములు:

ప్రభ తన లాప్ టాప్ లో Game of Thrones చూస్తున్నాడు. అది వైట్ వాకర్స్ తో యుద్ధం జరుగుతున్న సీన్. ప్రభ ఎంతో ఉత్కంఠతో కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. ఇంతలో తన లాప్ టాప్ అద్దం మెల్ల మెల్లగా బీట్లించటం మొదలైంది. వైట్ వాకర్స్ అందులో నుండి బయటకి వస్తున్నారా అని భయపడేలోపు స్క్రీన్  మొత్తం పగిలిపోయింది. ప్రభ తన బాల్కనీలో నుండి చూస్తూ ఆలోచిస్తున్నాడు. బాల్కనీ నుండి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ ని చూశాడు. అంతా చీకటిగా ఉంది కాని దగ్గర్లో ఉన్న గది నుండి వస్తున్న కాంతిలో ఒక అక్షరం రావటం గమనించాడు ప్రభ. ‘M’

లాప్ టాప్ ఎంతో పాతది కావటంతో ఎదో షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని ఊరుకున్నాడు. ఒళ్ళంతా చిరాకుగా అనిపించి వేడి నీటి స్నానం చేశాడు. వేడి నీటి సెగలకి బాత్ రూం లో ఉన్న అద్దం అంతా చమురు పట్టుకుంది. కానీ కొన్ని నీటి బిందువులు కిందకి జారుతూ ఒక లెటర్ గా మారటం గమనించాడు.  ‘U’

అలా ఉన్న ‘U’ లో నుండి వెనకాల ఏదో తెల్లగా ఉన్నట్టు కనిపించింది. ప్రభ కి భయం మొదలైంది. తన వెనకాల ఉన్నది ఎవరైనా దొంగా? మనిషి ఐతే ఇప్పటికే తనని కొట్టి తప్పించుకునే వాడు. నిజంగానే ఎదైనా ఉండి ఉంటే అది ప్రభకి కనిపించేదే కదా. భయపడుతూ వెనక్కి చూశాడు. అక్కడ ఎమీ కనబడలేదు. అద్దంలో చూసాడు. అక్కడ మాత్రం ఎవరో ఉన్నట్టు తెల్లగా కనబడుతోంది. అద్దంకు పట్టిన చమురు అంత తుడిచేశాడు.  ఇప్పుడు ఏమీ కనబడట్లేదు.

భయంతో గొంతు తడి ఆరిపోయి నీళ్ళు తాగుతుండగా హాల్లో నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఏం జరిగిందో అని కంగారుగా తాగుతున్న బాటిల్ ని పడేసి హాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ టి.వి. ఆన్ చేసి ఉంది ఫుల్ సౌండ్ లో! టి.వి. ని ఆపేసి కిచెన్ కి వెళ్ళాడు. పడిపోయిన  బాటిల్ ని తీసి కింద పడిన నీటిని తుడిచే లోపు ఇంకొక లెటర్ గమనించాడు. ‘I

ఈ లెటర్స్ ఏం చెప్తున్నాయ్ MUI? MIU? UMI? UIM? IUM? IMU?….???? I M U? I AM YOU!

ఇప్పటివరకు దెయ్యాలని నమ్మని ప్రభకి జరిగినవన్నీ చూశాక దెయ్యాలు ఉన్నాయేమో అన్న సందేహం కలిగింది. దెయ్యాలతో ఎలా మాట్లాడాలి అని గూగుల్ లో వెతుకుంతుండగా బాత్ రూం తలుపు కొట్టుకుంటున్న శబ్దం వచ్చి లోపలకి వెళ్ళాడు. ఎవరూ కనబడలేదు. లైట్ ఆపి బయటకొస్తుండగా చీకట్లో అద్దం లో ఏదో కనిపించి చూశాడు. కళ్ళు, నోరు తప్ప పైనుండి కింద దాక తెల్లగా ఉంది ఒక రూపం. వెనక చూశాడు ఎవరూ లేరు. లైట్ వేసి చూశాడు. అద్దంలో, బయట, ఎక్కడా ఏమీ లేదు. మళ్ళీ లైట్ ఆపేశాడు. అద్దం లో అదే రూపం. ఎలాగైనా విషయం తేల్చాలని భయంగా ఉన్నా కూడా అద్దంలో దెయ్యాన్ని జాగ్రత్తగా గమనించాడు. అది ఏదో చెప్తోంది కానీ ప్రభకి ఏమీ వినబడట్లేదు. ఈసారి కొంచెం దగ్గరగా వెళ్ళి చెవి అద్దంకి దగ్గరగా పెట్టాడు. ఎవరో గుస గుస లాడుతున్నట్టు గొంతు వినిపిస్తోంది – “స్మశానం… మర్రి చెట్టు…స్మశానం… మర్రి చెట్టు…”

సమయం రాత్రి ఒంటి గంట అయినా కూడా ఇదేంటో ఇప్పుడే తేల్చుకోవాలని స్మశానానికి వెళ్ళాడు ప్రభ. నల్లని చీకటిని చీల్చుకుంటూ పైకి వచ్చిన సమాధులు, ఎండిపోయిన చెట్టు కొమ్మలు దాటుకుంటూ మర్రి చెట్టుని వెతుకుతూ వెళ్తున్నాడు. కాళ్ళ కింద మట్టి, రాళ్ళు, అప్పుడప్పుడు ఎముకలు తగులుతున్నాయి. కళ్ళు మూసుకుని అవన్నీ దాటుకుంటూ మర్రి చెట్టు చేరుకున్నాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మర్రి చెట్టు చుట్టూ తిరిగాడు. ఏమీ కనబడలేదు. మర్రి చెట్టు తొర్రని గమనించి లోపల చూశాడు. ఎవరూ లేరని బయటకొస్తుండగా ఒక గొంతు వినిపించింది. “లోపలకి రా!

ప్రభ లోపలకి వెళ్ళి కూర్చున్నాడు.

“ఎవరు నువ్వు? నిజంగా దెయ్యనివేనా? దెయ్యం ఐతే ఎవరు చనిపోయాక వచ్చావ్? నన్నెందుకు పట్టుకున్నావ్? ఎందుకిలా…”

“అక్కడ ఆగు, నీ ప్రశ్నలు మండ. ప్రశ్న తర్వాత ప్రశ్న తప్ప నన్ను మాట్లడనీవే? నేను నీ ఆత్మని, అదే నీలా ఉండే ఇంకోడి ఆత్మని.”

“నాలా ఇంకొకడు ఉన్నడా ఈ లోకంలో?”

“ఈ లోకం లో కాదు సామీ…నీకెలా చెప్పాలో తెలవట్లేదు. నువ్వు టైం ట్రావెల్ గురించి వినే ఉంటావు కదా.”

“అంటే నువ్వు భవిష్యత్తులో చనిపోబోయే నా ఆత్మవా?”

“లేదు. టైం ట్రావెల్ ఉంది కాని నువ్వు అనుకున్నట్టు ఇదే లోకంలో కాదు. ఈ ప్రపంచం లాగే బయట కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల ప్రపంచాలున్నాయి. వాటినే సమాంతర ప్రపంచాలు అంటారు. Parallel Universe అని. కాని మనుషులు ఒక దాని నుండి ఇంకోదానికి ప్రయాణించలేరు. దాని కోసం worm hole నుండి ప్రయాణించాలి. దాన్ని ఎలా దాటివెళ్ళాలి అని ఇప్పటికీ మనుష్యులకి తెలీదు. కాని ఆత్మలు ప్రయాణించొచ్చు. అసలు విషయం ఏంటంటే నేను ఒక ఆత్మ వల్ల చంపబడ్డాను. నన్ను చంపినట్టే అది వేరే ప్రంపంచాల్లో ఉన్న నన్ను.. అదే నిన్ను.. అదే మనల్ని చంపుకుంటూ పోతోంది. ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేది తెలీదు. అది తెలుసుకుని దాన్ని ఆపకపోతే ప్రభ అనే నువ్వు.. అదే నేను..అబ్బా అదే మనం మిగలం ఏ  ప్రపంచంలోను. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు మనిషిలాగ..ఎవరు అని తెలుసుకుని, ఎందుకు అని తెలుసుకుని దాన్ని అరికట్టాలి.”

ప్రభకి అంతా అయోమయంగా ఉంది.

“ఐనా నేనెలా తెలుసుకోగలను. తెలుసుకున్నా నేనెలా ఆపగలను.”

“నేను కూడ నీతోనే ఉంటా కాని జీవం ఉన్న మనిషి మాత్రమే ఎమన్నా చేయగలడు. నేను ఏమీ చేయలేను దాన్ని అడ్డుకోవటం తప్ప. వేరే ప్రపంచం లో దానిని అడ్డుకుని మనల్ని కాపాడాను కాని దాన్ని వేరే ప్రపంచాలకి వెళ్ళకుండా ఆపలేను.”

“సరే ఇద్దరం కలిసి ఏం చేయాలో చూద్దాం. కానీ ప్రతి సారి నేను ఈ మర్రి చెట్టులోకి రావాలా నీతో మాట్లాడాలంటే?”

“అక్కర్లేదు. ఇవాళ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీక ఇక్కడకి రమ్మన్నా. నువ్వు ఎక్కడైన ఎప్పుడైనా నాతో మట్లాడొచ్చు నువ్వు చచ్చేదాక లేక నేను వెళ్ళేదాకా.”

“సరే అది ఎప్పుడు వస్తుందో తెలుసా?”

“ప్రతిసారి అది 2011-09-23 న చంపుతోంది అన్ని ప్రపంచాల్లో. అంటే ఈరోజు రావచ్చు.”

“నీ ****…చాలా తొందరగా చెప్పావ్ కదా! ఇంత తక్కువ టైం లో ఏం చేయాలో ఎలా తెలుసుకోవాలి”

“అది నీ ఇష్టం. నేనెలగూ చచ్చా. నువ్వే చచ్చి నాలో కలిసిపోతావ్. మనం మళ్ళీ వేరే వాడిని కాపాడటానికి పోవాలి.”

“దేవుడా!!!” ఆలోచించుకుంటూ ఇంటికి బయలు దేరాడు ప్రభ.

********************************************************

తేది: 2016-09-23 సమయం 12 గంటలు:

దెయ్యం వస్తుందని తెలుసు కానీ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియక భయం భయంగా గదిలో కూర్చున్నాడు ప్రభ. ఒకవేళ తను దెయ్యంకి బలైపోతే మళ్ళీ ఈ లోకంలో తిరగలేడని ఎలాగైనా దాన్ని వదిలిపెట్టకూడదని ప్లాన్ లేకపోయినా సంకల్పం మాత్రం పెట్టుకున్నాడు. ప్రభ ఈ ఆలోచనల్లో ఉండగా కరెంటు పోయింది. “ఓరి దేవుడా కరెంటు ఉంటేనే ఏం చేయాలో తెలియదు మధ్యలో ఈ ఎఫెక్ట్లు అవసరమా” అనుకున్నాడు. విధృతంగా వీస్తున్న గాలికి బాల్కనీ తలుపులు టక టకా కొట్టుకుంటున్నాయి. తలుపులు వేద్దామని చీకట్లో చేతులు ముందు పెట్టుకుంటూ ఎక్కడో అక్కడ తలుపుని పట్టుకోవచ్చు అని ముందుకు వెళ్తున్నాడు. ఇంతలో కనబడక కొట్టుకుంటున్న తలుపుల మధ్యలో చేతులు పెట్టాడు. దెబ్బకి ప్రభ చేతులు తలుపుల మధ్యలో నలిగి పోయి అరుచుకుంటూ వెనక్కి పడ్డాడు. అద్దాలు పగలటం, కుర్చీలు ముక్కలవటం, తలుపులు బద్దలవటం అన్ని శబ్దాలు వినబడుతున్నాయి కానీ ఏదీ కనబడటం లేదు. ఇంక తనేమి చేయలేననే నిస్సహాయత ప్రభ గుండెల్లోకి చేరుకుంది. కానీ ఆ దెయ్యం ప్రభని అంత సులువుగా చావనివకూడదన్నట్టు ప్రభని గదిలో అటు మూల నుండి ఇటు మూలకి ఈడుస్తూ ఈడ్చినపుడల్లా గోడకేసి గుద్దుతూ నానా రకాలుగా నరకం చూపించ సాగింది. దెయ్యం చేస్తున్న గుద్దులకి ప్రభ ఒంటిలో చాలా చోట్ల రక్తం బయటకి వస్తోంది. ఇంక తట్టుకోలేక ప్రభ “నన్ను ఇక్కడ చిత్ర హింసలు పెడుతుంటే అడ్డుకోకుండా ఏం చేస్తున్నావ్ ప్రభ?” అని అడిగాడు తన ఆత్మని.

“నేను ఇప్పుడు అడ్డుకుంటే నిన్ను వదిలేసి వేరే వాడి దగ్గరకి పోతుంది. అసలు ఎవరు అనేది తెలియాలి. లేకపోతే నిన్ను బ్రతికించినా అర్ధం ఉండదు.”

“దుర్మార్గుడా ఎక్కడో ఉన్న ఎవడికోసమో ఇక్కడున్న నన్ను చంపేస్తావా?”

తన ఆత్మ నుండి ఎటువంటి సమాధానం లేదు. ప్రభా కి అర్ధం ఐంది ఇదే తన చివరి రోజు అని.

ఇంక చేసేది ఏమీ లేక కోపంతో ఆవేశంగా పిచ్చి పిచ్చిగా అరవటం మొదలు పెట్టాడు ప్రభ. “ఏవతివే నువ్వు, నన్నిలా పట్టుకుని పీడిస్తున్నావ్. నువ్వెవరు అనేది కూడా నాకు తెలీదు. నన్ను చంపి ఏ రకమైన పైశాచికానదం అనుభవిస్తావ్? నేనెలాగు చచ్చే వాడినే కానీ నన్ను ఎవరు చంపారో తెలియకుండా పోతే అది నువ్వు గెలిచినట్టు కాదు. నేను గెలిచినట్టు. చరిత్రలో నా చావు మీద నీ పేరు ఉండదు. నా ఆత్మకి కూడ నీ లాంటి పైశాచి ఒకటి ఉన్నదని తెలీదు. నన్ను చంపై, నీకు అదే కావాలనుకుంటే నువ్వెవరో చెప్పకుండానే చంపేయి.”

దెయ్యం ప్రభని ఈడ్చటం ఆపేసింది. ప్రభ కొంచెం ఊపిరి తీసుకుంటుండగా ఏవో గుస గుసలు వినబడుతున్నాయ్. ఆఆఆఆ…అని కీచు గొంతు మెల్ల మెల్లగా స్వరం పెంచుకుంటూ ప్రభ చెవుల నుండి రక్తం వచ్చేంత గట్టిగా అరవటం మొదలు పెట్టింది.

బొంగురు గొంతుతో “చంపేశావ్, నన్ను చంపేశావ్. నన్ను చంపి నువ్వు మాత్రం ప్రశాంతంగా బ్రతుకున్నావ్. ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భార్యని, నన్ను ఇద్దర్ని కలిపి ఒకేసారి చంపేసి ఏం జరగనట్టు జీవిస్తున్నావ్. నిన్ను వదిలేది లేదు.”

“నేను నిన్ను చంపానా? ఎప్పుడు?”

“నీ జీవితంలో చంపినవాళ్ళని కూడా అంత సులువుగా మర్చిపోయావా. అవునులే నీకు మనుష్యులని చంపటమే పని కదా ఎంత మందిని గుర్తు పెట్టుకోగలవ్. నేను నీ వల్ల లారీ కింద పడి చనిపోయినవాడిని. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నా. నీ లాంటి హంతకులకి ఈ లోకంలో చోటు లేదు.”

“ఉండు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. నిన్ను నేను కాపాడదామని చూశా. కానీ నువ్వు అప్పటికే చనిపోయావు. నేను చంపానని ఎవరు చెప్పారు నీకు.”

“నీ బండి మూలంగానే కదా నేను చనిపోయింది. ఆ బండి మీద నిన్ను చూశాను.”

“బండి మీద నన్ను చూశావు కానీ నడుపుతున్నది ఎవరో చూడలేదా? అది నడుపుతున్నది నా ఫ్రెండ్ నాని!”

“అవునా, అయితే తర్వాత వాడి పని కూడా చూస్తా.”

“నువ్వు ఇలా అందర్ని చంపుకుంటూ పోతూనే ఉంటావా. ఇలా చంపుకుంటూ పోయే బదులు నిన్ను నువ్వు చావకుండా కాపాడుకోవచ్చు కదా?”

దెయ్యం నుండి ఎటువంటి సమధానం రాలేదు. పోయిన కరెంటు తిరిగి వచ్చింది. ప్రభ కి అర్దం అయింది ఆ దెయ్యం ఇక రాదని!

********************************************************

తేది: 2011-09-23 సమయం – ఉదయం 12 గంటలు:

“ఏం పాఠాలు అంత బాగా నచ్చాయా ఇంతసేపు కూర్చున్నావ్ క్లాస్ లో. పావుగంటలో ఆట మొదలవుతుంది. నీ వల్ల సూపర్ స్టార్ ఎంట్రీ మిస్ అవుతాం ****.” కొంచెం చిరాకుతో అన్నాడు నాని.

“మీ కంప్యూటర్ గాళ్ళకేముంది మాస్టర్లు పట్టించుకోరు, మీరూ కష్టపడరు కాని చివర్లో పే చెక్కులు మాత్రం దొబ్బేస్తారు. మా డిపార్ట్ మెంట్ కి వచ్చి చూడు తెలుస్తది సైకోలు ఎక్కడో కాదు మా చుట్టూనే ఉన్నారని.” అని సంజాయిషి  ఇచ్చుకుంటూ బండి తీసాడు ప్రభ.

“బండి నేను నడుపుతాను ఇవ్వు, నువ్వు నడిపితే వెళ్ళేసరికి సగం సినిమా అయిపోతుంది.”

“నీకు బండి ఇవ్వటం మళ్ళీ జరగని పని. ఆ స్పీడ్ చూస్తే అంబులెన్స్ గుర్తుకొస్తోంది.”

“ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేస్తావ్. ఐనా నిన్ను అడిగేది ఏంటి బొంగు” అని బండి తాళాలు తీసుకున్నాడు నాని.

ఇంక చేసేది ఏమి లేక తాళాలు ఇచ్చి వెనకాల కూర్చున్నాడు ప్రభ. ఇద్దరూ కలిసి థియేటర్ కి బయలుదేరారు. ప్రభ ఎంత చెప్పినా నాని మాత్రం స్పీడు తగ్గించటం సరి కదా ఇంకా పెంచుకుంటూ పోతున్నాడు. తన స్పీడుతో దారికి అడ్డు వచ్చే వాళ్ళందరిని భయపెడుతూ ఆకతాయిగా వెళ్తున్నాడు.  ఇంతలో ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు రోడ్డు దాటుతున్నాడు రాఘవ్. ఎదురుగా లారీ వస్తోందని చూసి అది వెళ్ళాక మిగతా సగం దాటుదామని రోడ్డు మధ్యలో వేచి చూస్తున్నాడు రాఘవ్. ఇంతలో స్పీడ్ మీదున్న నాని రాఘవ్ ని చూసి కవ్వించటానికి కొంచెం దగ్గరగా వెళ్ళాడు. అంత వరకు లారీని గమనిస్తున్న రాఘవ్ హఠాత్తుగా వచ్చిన బండిని చూసి బెదిరి ముందుకి జరిగాడు. అదే సమయానికి జోరుమీదున్న లారీ వచ్చి రాఘవ్ ని ఢీ కొట్టింది. రాఘవ్ రక్తంతో రోడ్డు మీద పడిపోయి ఆఖరి చూపులు చూస్తున్నాడు. ప్రభ కంగారు కంగారుగా వచ్చి రాఘవ్ ని ఆసుపత్రికి తీసుకెళ్దామని చూసాడు. తనకి సాయపడుతున్న ప్రభ తప్ప ఇంకేమి కనబడట్లేదు రాఘవ్ కి. మెల్లగా కళ్ళు మసక మసకగా మారి చూపు కోల్పోయాడు రాఘవ్. తర్వాత చేతులు, కాళ్ళు స్పృహ కోల్పోయి, మెదడు మందగించి, ఊపిరి వదిలేశాడు రాఘవ్.

********************************************************

తేది: 2011-09-23 సమయం – ఉదయం 12 గంటలు:

“ఏం పాఠాలు అంత బాగా నచ్చాయా ఇంతసేపు కూర్చున్నావ్ క్లాస్ లో. పావుగంటలో ఆట మొదలవుతుంది. నీ వల్ల సూపర్ స్టార్ ఎంట్రీ మిస్ అవుతాం ****.” కొంచెం చిరాకుతో అన్నాడు నాని————తన స్పీడుతో దారికి అడ్డు వచ్చే వాళ్ళందరిని భయపెడుతూ ఆకతాయిగా వెళ్తున్నాడు.

తన భార్యకి మందులు ఇవ్వాలన్న కంగారులో రోడ్డు దాటుదామని వెళ్తున్న రాఘవకి ఎగురుకుంటూ వచ్చిన లెటర్ ఒకటి మొహంకి అంటుకుంది. అది తెల్ల కాగితం. పడేసి ముందు చూస్తే రయ్ మని దూసుకెళ్తున్న ఆకతాయి కుర్రాళ్ళు. వెధవ సంత అనుకుని కొంచెం సేపు ఆగాడు. ఇది చూసి రాఘవ్ ఆత్మ సంతోషపడింది. ఇంతలో రోడ్డు మీద కాలినడక మీద ఉన్న రాఘవ్ ని లారీ వచ్చి ఢీ కొట్టింది. రాఘవ్ చనిపోయాడు. రాఘవ్ ఆత్మ లారీ డ్రైవర్ ని చంపుదామని లోపల చూసింది. లోపల ఎవరూ లేరు. లారీ లైట్లు వెలిగి ఆరుతున్నాయి. రాఘవ్ కి మతి పోయింది. తనని చంపాలనుకుంది మనుషులు కాదా!!!!

————————-కథ సమాప్తం————————

 

– A Short Story By Hari