కృష్ణా కలిపిన కథ!

అందరికి నమస్కారం. నా పేరు రాజ్, కాట్రాజ్ కాదు జస్ట్ రాజ్. నేను IT కంపెనీలో software engineer. అందులోను బ్యాచిలర్. ఇంక నా బాధలేంటొ మీకు వివరించి చెప్పక్కర్లేదు కదా. ఎలాగూ ప్రపంచం మొత్తానికి తెలుసు. కూర్చునేది AC రూంలోనే కానీ సాయంత్రం కల్లా బ్రైన్ మాత్రం ఫ్రై అయిపోతుంది. గుంపుగా రావటం, గుంపుగా పోవటం, మధ్యలో నిద్ర రాకుండా ఛాయి బిస్కెట్లు తినటం. ఎందుకు రాస్తున్నామో, ఎవరి కోసం రాస్తున్నామో తెలీదు కానీ పేజీల మీద పేజీలు  ప్రోగ్రాంస్ రాయటం. అప్పుడప్పుడు బ్యాంకు బ్యాలన్స్ పెంచటానికి ఒక ప్రోగ్రాం రాస్తే బ్రతుకు బంగారం అయిపోతుంది కదా అనిపిస్తుంది. కాని నా బాస్ అంత ఛాన్స్ ఇస్తేగా. డెడ్ లైన్స్, డెలివరబుల్స్ అని అడ్డమైన కబుర్లు చెప్పి అర్ధ రాత్రి వరకు ఆఫీస్ లోనే కూర్చోపెడతాడు. ఇవన్ని పక్కన పెట్టి భోజనంకి వద్దాం. బహుశా వెయ్యి లైన్స్ కోడ్ రాయటానికి కూడా అంత ఆలోచించక్కర్లేదేమో. ప్రతి రోజు ఈ రోజు ఏమి తినాలి అని ఆలోచించటం, అదేదో అక్కడ పంచ పక్ష పర్వాన్నాలు ఉన్నట్టు. రోజూ సేం ఐటం, సేం టేస్ట్, సేం నిరాశ, కానీ ఏం చేయగలం వెజ్ రెస్టారంట్ కి వెళ్ళి నాన్వెజ్ ఆర్డర్ ఇవ్వగలమా. ఉన్న ఛాయిస్ తో సర్దుకుపోవాలి కదా.

అవును లంచ్ అంటే గుర్తుకు వచ్చింది. రోజూ లంచ్ కి మా టీం లో తెలుగు వాళ్ళం నలుగురం కలిసి వెళ్తుంటాం. ఒకడు ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాడు కాబట్టి లంచ్ ఇంటి నుండే, ఇంకోడు డైలీ బ్లడ్ డొనేషన్ చేస్తాడన్న రేంజ్ లో టమాటాలు, క్యారెట్స్, ఫ్రూట్స్ బాగా తినేస్తుంటాడు. ఇక నా గురించి తెలిసిందే కదా అరటి తొక్క నలక్కొట్టి తొక్కుడు పచ్చడి అని పెట్టినా తినాల్సిందే. పెద్ద ఛాయిస్ ఏముంటది. నలుగురని ముగ్గురి గురించే చెప్పా గమనించారో లేదో. దానికి కారణం లేక పోలేదు. ఎందుకంటే ఆ నాలుగో వ్యక్తి గురించి చెప్పేటపుడు మెదడు మైకంలోకి జారుకుంటుంది, మాట కృష్ణ శాస్త్రి పద్యాలు అందుకుంటుంది, గుండె వేగాన్ని పెంచుతుంది. తన పేరు ప్రియ. అవును తనంటే నాకు ఇష్టం, కాని ఎప్పుడు ఈ విషయం చెప్పాలన్నా ఒంట్లో వణుకు పుట్టటమో లేక గొంతులో ధ్వని గొట్టాలు కూరుకుపోయాయేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎలాగైతేనేం మేమందరం తినటానికి కూర్చుని మాట్లాడుకోవటం మొదలుపెట్టాం. ఇంతలో ప్రియ తనకి రెండు రోజుల్లో పెళ్ళిచూపులు అని చెప్పింది. తను పక్కన ఉంటే గబగబా కొట్టుకునే గుండె ఒక్కసారిగా కొట్టుకొవటమే ఆపేసింది. కంగారుగా, కలవరపడుతూ నేను లేచాను. అవును నిద్ర లేచాను 😛 కదులుతున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ లో జారుకుంటున్న రాధని ఎలాగైన పట్టుకోవాలని ఆత్రుతతో లేచాను. ఇందంతా కలేనా అనుకుని ఆనంద పడదాం అనుకున్నా కానీ, ఆ దేవుడున్నాడే  ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదా. కలలో కనీసం పెళ్ళి చూపులు దగ్గరే ఉంది. కానీ… ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా. ఐతే నేను నిద్ర పోక ముందు ఏం జరిగిందో మీకు తెలియాలి. ఒక నెలలొ తన పెళ్ళి ఉంది తప్పకుండా రావాలి అని ఇచ్చిన ఆహ్వాన పత్రిక ఒక ప్రక్క, ఇచ్చిన, నచ్చిన కన్నె పిల్ల ఇంకొక ప్రక్క! అవును, నిజం చేదు గానే ఉంటుంది. కానీ ఒక అందమైన అబద్ధం కి అలవాటు పడ్డాక ఆ నిజమే విషంలా మారుతుందని ఇప్పుడే అర్ధమయింది!

ఇంతకీ అసలు కథ ఎప్పుడు మొదలయింది అంటే నా మానాన నేను విజయవాడ స్టేషన్ లో మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి కృష్ణా ఎక్స్ ప్రెస్ ఎక్కి తిరుపతికి బయలుదేరినప్పుడు. సీటులో కూర్చుంటే చాలా హాట్ గా ఉందని బోగీ గేట్ దగ్గర నిలుచున్నా. రైలు కదిలింది, గాలి తాకింది, హాయి కలిగింది, కూత మోగింది. ఇంతలో కూతని మించి ఒక స్వరం వినిపించింది…హలో ఇది కృష్ణా ఎక్స్ ప్రెస్ ఏనా అని. అవును అని తల ఊపుతూనే ఎవరో అని తిరిగి చూశాను. అదే నా జీవితం లో నేను చేసిన పెద్ద తప్పు అవుతుందని అప్పుడు నాకు తెలియలేదు. అప్పటిదాకా తిక్కెక్కిన పిచ్చోళ్ళు మాత్రమే Love at first sight అని అంటారు అనుకున్నా కానీ ఇప్పుడే నేను కూడ ఆ పిచ్చోళ్ళ జాబితాలో చేరిపోయాను అని అర్ధమైంది. కొంతమందిని చూడగానే మనకు దగ్గర వాళ్ళ గానో లేక దగ్గర చేసుకోవలనిపించే వాళ్ళ గానో అనిపిస్తారు. బహుశా మనం పెరుగుతున్న కొద్దీ మన చూపు కొన్ని రకాల మనుషులకి అలవాటు పడిపోతుంది ఏమో. అందుకే ఊహ తెలియని వయసులోనే అమ్మకి అలవాటు పడిపోయేది ఈ చూపుతోనే, ఊహ తెలిసిన తర్వాత స్నేహాన్ని మొదలు పెట్టేది ఈ చూపుతోనే, అంతెందుకు పెళ్ళి వయసు వచ్చాక సంబంధం కుదుర్చుకోవటం మొదలుపెట్టేది పెళ్ళి చూపులతోనే కదా! మరి ఇన్నిటికి అలవాటు పడ్డాక కూడా Love at first sight లేదని ఎందుకు వాదించానో నాకే తెలీదు. నా మెదడులో ఆలోచనలన్నీ ఆవిరయ్యే సమయానికి నేను ఊపిన తలని చూసి ఆ అమ్మాయి రైలు ఎక్కటం కూడా జరిగిపోయింది.

“ఏమోయ్, అలా గుడ్లు అప్పగించి చూడకపొతే DDLJ లో షారుఖ్ లాగా చెయ్యి పట్టుకుని లాగొచ్చు కదా. స్టుపిడ్ ఫెలో”

“అక్కడ కాజోల్ ని లాగినందుకు షారుఖ్ కి డబ్బులొచ్చాయ్, నిన్ను లాగితే నాకేమొస్తుంది చేయి నొప్పి తప్ప. ప్రతి వోళ్ళు సినిమాలు చూసేయటం సెటైర్లు వేసేయ్యటం”

“ఐనా నీతో నాకేంటి ఇంత అందమైన అమ్మాయి చేయి పట్టుకునే అవకాశం వదులుకున్నందుకు నువ్వే బాధ పడాలి”

అని పొగరుగా వెళ్ళిపోయింది. కాసేపు గడిచాక నేను కూడా ఇక కూర్చుందామని నా బెర్త్ దగ్గరకి వెళ్ళాను. చూస్తే నా ఎదురు బెర్త్ లోనే తను కూర్చుని ఉంది.

“హాయ్, నాపేరు రాజ్. నీ పేరు…”

“నేను అపరిచితులతో మాట్లాడను, అందులోను నా అందాన్ని గుర్తించని వాళ్ళతో అసలే మాట్లాడను”

“అదా అసలు ఇందాక ఏం జరిగింది అంటే నిన్ను చూస్తున్నంత సేపు కళ్ళు కదలకూడదని ఒట్టు పెట్టుకుంది, నీ అందాన్ని బంధించాలని మెదడు పని కట్టుకుంది, కాలం ఆగిపోవాలంటూ మనసు మారాం చేసింది. మొత్తంగా నా శరీరమే శృతి తప్పింది”

“నువ్వు రచయిత కదా?”

“అవును నీకెలా తెలుసు?”

“ఇంత భారీ డైలాగులు కాజేసి ఐనా ఉండాలి లేక సొంత కలం నుండైనా వచ్చి ఉండాలి. కజెసింది ఐతే ఇప్పటికే ఎవడో ఒకడు నాకు వినిపించి ఉండేవాడు.”

“నాకు మీ అమ్మ నాన్నలను తలుచుకుంటే బాధ వేస్తోంది”

“ఏ వాళ్ళకేం అయింది?”

“ఇంత గొప్ప అందానికి నామకరణం చేయటానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కదా అని!”

“అవును, బాగా కష్టపడ్డారు. కానీ ఏమీ దొరకక చివరికి ప్రియ తో సరిపెట్టుకున్నారు.”

“ప్రియ, ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటి?”

“హలో బాస్, Don’t get any ideas. ఇదిగో నా ఇన్విటేషన్ కార్డ్. ఒక నెలలో నా పెళ్ళి”

దేవుడా…అమ్మాయిని చూపించావ్, అవకాశం ఇచ్చావ్ అనుకున్నా, కానీ పెళ్ళి భోజనం ఇచ్చావా తండ్రీ.

“అవును నీ పెళ్ళి లవ్ మ్యారేజ్ ఆ?”

“కాదు అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ నాన్నకి నచ్చారు, వచ్చి చూశారు, పెళ్ళి ఖరారు చేశారు.”

“జీవితాంతం కలిసి ఉండాల్సిన వాడితో కనీసం మట్లాడకుండా పెళ్ళికి రెడీ అయిపోయావా”

“ప్రేమించటం ఎంత పని. అర్దం చేసుకోవాలే కానీ ప్రపంచం లో ప్రతి మనిషిలోను ప్రేమని పుట్టించొచ్చు.”

“కాని ఆ దేవుడు ప్రతి మనిషికి ఇంకో మనిషిని పుట్టించి ఉంటాడు. ఇద్దరు కాస్త మాట్లాడి ఒకరి గురించి ఒకరు తెలుసుకుని కరెక్ట్ అనుకుంటే పెళ్ళికి సిద్ధ పడాలి అని నా అభిప్రాయం. ఒకవేల నీ సరిజోడి వీడు కాదని పెళ్ళి అయ్యాక తెలిస్తే ఏం చేస్తావ్?”

“అందరూ ఇదే అంటారు. ఎవరో ఒకల్లే సరిజోడి మిగిలిన వాళ్ళంతా బోడి అని. కాని నేను చెప్పేది ఏంటంటే చాల జోడీలు ఉంటాయ్. ముందు ఎవరు వస్తే వాళ్ళని అర్ధం చేసుకుంటాం, ఆకర్షితులం అవుతాం. ఇప్పుడు నువ్వే ఉన్నావ్. నన్ను కలిశావ్. ప్రేమ పుట్టింది అనుకున్నావ్ అనుకో, తర్వాత ఏం చేస్తావ్, నన్ను ఇంప్రెస్స్ చేయటానికి ట్రై చేస్తావ్, దానికోసం నాకు నచ్చిన విషయాలేంటో తెలుసుకోవటానికి చూస్తావ్. నాకు నచ్చే విధంగా నీ గురించి చెప్తావ్. ఒకవేల ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి నచ్చితే ప్రేమ గెలుస్తుంది. లేకపోతే ఇంకొక అమ్మాయి. అంతే కదా.”

“కానీ అలా ఒకరంటే ఒకరికి నచ్చటమే క్లిష్టమైన సమస్య. ముందు మాట్లాడకుండా అది ఎలా తెలుస్తుంది?”

“ఐనా అందరూ అంటారు కదా ప్రతి వాళ్ళకీ ఎవరో ఒకరే కరెక్ట్ మ్యాచ్ అని. అలా ఐతే ఇప్పుడు భార్య పోయిన భర్త లేక భర్త పోయిన భార్యో రెండో పెళ్ళి చేసుకుంటారు కదా. అంటే ఈ రెండో పెళ్ళి చేసుకున్నాక వాళ్ళ మధ్య ప్రేమ పుట్టదంటావా? ప్రేమ అనేది దేవుడి చేతిలో కాదు మన మనసులో పుడుతుంది. ఇంకో మనసుని అర్ధం చేసుకోవటం లో పుడుతుంది”

నాకు ఒక్కసారిగా రైలు కిటికీ నుండి మబ్బులు, వాటి పైన చుక్కలు కనిపించాయి. ఇంక చెప్పలేక పడుకుందామని డిసైడ్ అయ్యాను. అల నిద్ర పోతే వచ్చిన కలే నేను మొదట పెట్టిన కథ!

కల నుండి మేలుకుని నిజం చేయలేని అబద్ధాన్ని గుర్తు తెచ్చుకుని కొంచెం బాధ పడ్డాను.

“రాజ్, నువ్వు నా పెళ్ళికి తప్పకుండా రావాలి. లేకపోతే మన స్నేహం పోయినట్టే”

“ఏంటో మీ అమ్మాయిలు, నాకు అర్ధం కారు. అది సరే కాని తిరుపతిలో ఎక్కడ ఉండేది?”

“నేను తిరుపతిలో ఎందుకు ఉంటాను…”

“ఎందుకంటే తర్వాతి స్టేషన్ తిరుపతే కాబట్టి…లేక అక్కడ ఉద్యోగం చేస్తున్నావా?”

“అదేంటి ఈ ట్రైన్ సికిందరాబాద్ కదా వెళ్ళాల్సింది. నేనుండేది హైదరాబాద్ లో…”

ఒక్క క్షణం ప్రియ కళ్ళలో కంగారు, భయం చూశాను. అదే భయంతో, కొంచెం కోపంతో

“నువ్వే కదా ఇది కృష్ణా ఎక్స్ ప్రెస్ అని చెప్పింది, నీ వల్లే నేను ఈ రైలు ఎక్కింది. నేను నిన్ను చంపేస్తాను”

“అవును ఇది కృష్ణా ఎక్స్ ప్రెస్, కాని సికిందరాబాద్ నుండి తిరుపతి వెళ్తోంది”

“ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు. ఒంటి గంటకి రావాల్సింది సికిందరాబాద్ వెళ్ళే రైలు కదా.”

“నాకిప్పుడు అర్ధమైంది…సికిందరాబాద్ వెళ్ళే రైలు 1:30PM కి, తిరుపతి వెళ్ళే రైలు 1:15PM కి. సికిందరాబాద్ వెళ్ళేది రెండో ప్లాట్ ఫాం మీద ఉంది.”

“అయ్యో ఇప్పుడెలాగ, ఐన ఇదంతా నీ వల్లే. ముందె చెప్పచ్చు కదా ఇది తిరుపతి వెళ్తోందని.”

“ఇది మరీ బాగుంది రైలులో ఎక్కే వాళ్ళందరిని అడగటానికి నేను TC అనుకున్నావా ఏంటి. ఐనా ఇప్పుడేమైంది మా ఇల్లు రైల్వే స్టేషన్ కి దగ్గరే. మా ఇంటికొచ్చి కాస్త రెస్ట్ తీసుకో. ఈలోపు వేరే రైలు కి టికెట్ ట్రై చేయొచ్చు.”

ప్రియ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పింది. ఆయన ప్రియకి ధైర్యం చెప్పి, ప్రియకి కొంచెం కంగారు ఎక్కువ, కొంచెం తనతోనే ఉండి జాగ్రత్తగా రైలు ఎక్కించు బాబు అని నాకు చెప్పారు.”

నేను మొబైల్ ఓపెన్ చేసి 12:35AM కి శబరి ఎక్స్ ప్రెస్ లో ప్రీమియం తత్కాల్ టిక్కెట్ ఒకటి బుక్ చేశాను. ఇంతలో తిరుపతి స్టేషన్ వచింది. కాని దిగిన తర్వాత తెలిసింది శబరి ఎక్స్ ప్రెస్ మూడు గంటలు లేట్ గా నడుస్తోంది అని. ఇప్పుడింక టైం 10:00PM. అంటే ఇంకా అయిదున్నర గంటలుంది. నేను మా నాన్నకి ఫోన్ చేసి రమ్మన్నాను. తర్వాత ప్రియ, నేను, మా నాన్న కలిసి మా ఇంటికి వెళ్ళాం. ప్రియ మా అమ్మ చేతి వంట రుచి చూసింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ప్రియ, మా అమ్మ బాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ గదిలోకి వెళిపోయి మూడు గంటలసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇక రైలు వచ్చే టైం అయిందని తలుపు బద్దలుకొడితే కాని బయటకు రాలేదు. ఇంక ప్రియని శబరి ఎక్స్ ప్రెస్ ఎక్కించి వీడ్కోలు పలికాను. కానీ తన ముఖంలో ఇంతకు ముందున్న కంగారు లేదు, తను చాలా ఆనందంగా ఉంది. కాని నాకు తెలుసు, కదులుతున్న రైలు మా మధ్య దూరాన్ని కూడ పెంచుతోందని.

ఒక వారం తర్వాత మా అమ్మ, నాన్న నన్ను కూర్చోపెట్టి సమావేశం మొదలుపెట్టారు.

అమ్మ: “ఏరా, నీకు పెళ్ళి వయసు వచ్చింది. అందుకే నీకో మంచి పిల్లని చూశాం. నువ్వు పెళ్ళికి రెడీనే కదా?”

నేను: “అమ్మా అది.. నేనిప్పుడు పెళ్ళికి మెంటల్ గా రెడీ కాదు. నాకు కొంచెం టైం కావాలి.”

అమ్మ: కనీసం అమ్మాయిని చూడు. ఆ తర్వాత కూడా నచ్చకపోతే ఆగుదాం. సరేనా.”

ఏదో వాళ్ళ అనందం కోసం సరే అని చెప్పాను. పెళ్ళి చూపులు హైదరాబాద్ లో అట. అసలు వాళ్ళ ఊరి పేరు వినే 99% పెళ్ళి వద్దు అనుకున్నాను. ఎందుకంటే ఆ ఊరి పేరు చాలు నాకు ప్రియని గుర్తు చేయటానికి. ఇంక వేరే అమ్మాయిని ఎలా ఇష్టపడతాను అనుకుంటు ఇష్టం లేకుండానే అమ్మాయిని చూశాను.

“నువ్వు…నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కదా?” అని ఆకాశమంత ఆశ్చర్యంతో ప్రశ్న అడిగాను ఆ అమ్మాయిని…ప్రియని!

తర్వాత ప్రియతో మాట్లాడటానికి తనతో వెళ్ళినపుడు తెలిసింది అసలు ఏం జరిగిందో. శబరి ఎక్స్ ప్రెస్ లో ఎక్కాక ప్రియ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసినపుడు వాళ్ళ వియ్యంకుడు పక్కనే ఉన్నాడట. ప్రియ ఎవరో రైలులో కలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంటి అని నానా రభస చేశాడట. ఇంకేముంది పెళ్ళికి ముందే ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసినవాడు పెళ్ళి అయ్యాక ఇంకెన్ని చేస్తాడో అని పెళ్ళి రద్దు చేశారు. తర్వాత ప్రియ నా గురించి వాళ్ళ నాన్నకు చెప్పింది. వాళ్ళ నాన్న మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుకుని నాకు ముందే చెప్పకుండా ఇలా సర్ ప్రైస్ చేసారు!

కాని నాకు అర్ధం కాని విషయం ఏంటంటే ఆ రోజు మా అమ్మ, ప్రియ మూడు గంటలు పాటు ఏం మాట్లాడుకున్నారా అని 😛

– A Short Story By Hari

One thought on “కృష్ణా కలిపిన కథ!

Leave a comment